రీ సర్వేను పూర్తిచేయాలి: జేసీ పాలకొల్లు, (వార్తాపత్రిక) జనవరి -28:
రీ సర్వేను ప్రభుత్వం నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ లో నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే, సుమోటో కాస్ట్ వెరిఫికేషన్, ఐ వి ఆర్ ఎస్ కాల్స్ అంశాలపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2 తేదీ నుండి 9వ తేదీ వరకు 14 గ్రామాలలో 10,777 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేయవలసి ఉందని, ఇప్పటివరకు 5,853 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన పాస్ పుస్తకాలు కూడా పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో చిన్న తప్పు కూడా దొర్లకొండ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ సమయంలో ప్రతి రైతుతో వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు అన్నీ సంతృప్తికరంగా ఉన్నది,లేనిది తెలుసుకోవాలన్నారు. మార్చి నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయు 12 గ్రామాలలో 12,753 ఖాతాలు ఉన్నాయని వాటిని పరిశీలించి, లోపాలను సవరించి మార్చి 2 నుండి 9 వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేయడానికి ఇప్పటి నుండి సమాయత్వం కావాలన్నారు.ఫేజ్ -3 రీ సర్వే గ్రౌండ్ ట్రూథింగ్ ముఖ్య ఘట్టం పూర్తయింది అన్నారు. ఫేజ్ - 4 కు సంబంధించి రీ సర్వే జరుగుతున్న 24 గ్రామాలలో ప్రభుత్వం నిర్దేశించిన కాలవ్యవధిలో రీ సర్వే పూర్తిచేయాలని మండల, గ్రామ సర్వేయర్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత ఆర్డీవోలు, తహసిల్దారులు ఆయా గ్రామాలలో పర్యటించాలన్నారు. డిప్యూటీ తహసిల్దార్లు ప్రతిరోజు తనిఖీ చేస్తూ అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఫేజ్-4 సర్వే త్వరితిగతన పూర్తి చేసి రైతుల రికార్డులను అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు. రీ సర్వే కి సంబంధించి ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా సేకరించిన సమాచారం లో 83 శాతం అనుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, ఈ పి టి ఎస్ ఫైల్స్ అప్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ గూగుల్ మీట్లో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవోలు దాసిరాజు, ఖతిబ్ కౌసర్ భానో, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, మండల సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు