Banner
Watermark
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్‌ఈ
📅 04 February 2026, 03:08 PM ✍️ M.Chinna
News Image
వార్తపత్రిక, కూకట్ పల్లి, ఫిబ్రవరి 4:
ప్రభుత్వ కార్యాలయాల్లో వేళ్లూనుకున్న అవినీతికి మరో బలమైన ఉదాహరణగా కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జీహెచ్ఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) చిన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్‌ను లంచం ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. లంచం డిమాండ్‌తో విసిగిపోయిన బాధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన ట్రాప్‌లో భాగంగా లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఎస్‌ఈని అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలో సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహిస్తూ సంబంధిత పత్రాలు, ఫైళ్లను పరిశీలించారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని, లంచం డిమాండ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ప్రజా సేవకులుగా వ్యవహరించాల్సిన అధికారులు లంచాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, లంచం డిమాండ్‌లో ఇతరుల పాత్ర ఉందా అనే అంశంపై కూడా దర్యాప్తు చేపట్టినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
🏠 Home