కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, మార్చి 2:
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ (ఇన్-ఛార్జ్ గ్రామ పాలనా అధికారి) జి. గణేష్, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
బాధితుడి నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రాసెస్ చేయడానికి గణేష్ రూ. 20,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా గతంలోనే రూ. 5,000 అడ్వాన్స్‌గా తీసుకున్నారు. మిగిలిన రూ. 15,000 నగదును సోమవారం బాధితుడి నుంచి తీసుకుంటుండగా, సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
నిందితుడి నుంచి రూ. 15,000 లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు లేదా వాట్సాప్ నంబర్ 9440446106 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.