Banner
Watermark
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖమేనికి కంగ్రాట్స్ చెప్పిన పుతిన్.. ఇరాన్‌కు అండగా ఉంటామని హామీ
📅 09 March 2026, 05:38 PM ✍️ M.Chinna
News Image
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన అయతొల్లా మొజ్తాబా ఖమేనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఇరాన్‌కు మద్దతుగా ఉంటామని పుతిన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం పుతిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబాకు శుభాకాంక్షలు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్‌కు రష్యా అండగా నిలబడుతుంది. ఇరాన్‌లోని మా స్నేహితులకు, వారి సమగ్రతకు రష్యా మద్దతుగా ఉంటుంది. మొజ్తాబా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇరాన్ ప్రజల్ని ఏకతాటిపైకి తెస్తారని భావిస్తున్నాం. యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో నాయకత్వం వహించడానికి మొజ్తాబాకు గొప్ప ధైర్యం, పట్టుదల కావాలి’’ అని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు.

ఒకవైపు మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, రష్యా మాత్రం మద్దతుగా నిలవడం విశేషం. ఈ యుద్ధ సమయంలో ఇరాన్‌కు రష్యా నైతిక మద్దతు ప్రకటించింది. ఇటీవలే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. దాడుల్లో మరణించిన ఖమేనీ, అతడి కుటుంబ సభ్యులు, ఇరాన్ ప్రజలు, సైనికులకు పుతిన్ సంతాపం తెలిపారు. దీనికి మసౌద్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను అక్కడి అసెంబ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. 1969లో జన్మించిన మొజ్తాబా ఇరాన్‌లోనే మత గురువుల వద్ద విద్యనభ్యసించారు.

తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొజ్తాబా తండ్రి, ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతొల్లా ఖమేని, తల్లి, అతడి భార్య కూడా మరణించారు. మొజ్తాబా ఎన్నికతో అతడి మద్దతుదారులు ఇరాన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సహకరిస్తోందనే ఆరోపణలున్నాయి. దీనిపై అమెరికా కూడా ఆరోపణలు చేసింది.
🏠 Home