'గ్యాస్ కొరతపై కేంద్రం అబద్ధమాడుతోంది'- మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ - పార్లమెంట్ ఎదుట ఆందోళన
📅 11 March 2026, 12:52 PM
✍️ M.Chinna
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ మండిపడింది. గ్యాస్ కొరత గురించి వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా మోదీ సర్కార్ అబద్ధమాడుతోందని కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. కొరత లేనప్పుడు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని ఏజెన్సీలకు ఆదేశాలు ఎందుకిచ్చారని ప్రశ్నలు గుప్పించారు. అలాగే, పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రధానమంత్రి రాజీపడ్డారంటూ రాసిన ఫ్లెక్సీలను పట్టుకుని పార్లమెంట్ ద్వారం వద్ద నివాదాలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పర్యవసానాలు, ఎల్‌పీజీ కొరతపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు.