తప్పనిసరి నెలసరి సెలవులపై పిటిషన్- సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
📅 13 March 2026, 04:43 PM
✍️ M.Chinna
మహిళల నెలసరి సెలవులకు సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళా విద్యార్థులు, కార్మికులకు నెలసరి సెలవులు కల్పించే దేశవ్యాప్త విధానాన్ని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) స్వీకరించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రుతుక్రమ సెలవులు తప్పనిసరి చేస్తే ఎవరూ వారికి ఉద్యోగాలు ఇవ్వరని అభిప్రాయపడింది. అలాంటి చట్టం చేస్తే తాము పురుషుల కంటే తక్కువ అన్న భావన మహిళల్లో కలిగే అవకాశం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ బెంచ్ అభిప్రాయపడింది. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదంటూ ఫిటిషన్దారును ఉద్దేశించి వ్యాఖ్యానించింది.ఆ చట్టాన్ని తీసుకువస్తే, ఎవరూ వారిని నియమించుకోరు!విచారణ సందర్భంగా, చట్టం ద్వారా నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల కలిగే సామాజిక పరిణామాల గురించి ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విషయంలో మహిళల్లో నెలసరి అంశంపై అవగాహన కల్పించడం వేరని, దానిని సెన్సేషన్ చేయడం వేరని బెంచ్ పేర్కొంది. ఒకవేళ నెలసరి సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకువస్తే, ఆ మరుక్షణమే ఎవరూ వారిని నియమించుకోరని తెలిపింది.