Banner
Watermark
రష్యా చమురు కొనమని అమెరికా లోకాన్ని బతిమాలుతోంది"
📅 14 March 2026, 12:01 PM ✍️ M.Chinna
News Image
పశ్చిమాసియాలో యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్న తరుణంలో అంతర్జాతీయ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు రష్యా నుంచి చమురు కొనవద్దంటూ భారత్ వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చిన అమెరికా.. ఇప్పుడు అదే రష్యా చమురును కొనుగోలు చేయాలంటూ లోకాన్ని బతిమాలుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా అమెరికా ద్వంద్వ నీతిని ఎండగట్టారు.

అమెరికా తీరుపై అరాఘీ ఎద్దేవా..
"గత కొన్ని నెలలుగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపి వేయాలంటూ భారత్‌ను అమెరికా బెదిరించింది. కానీ.. ఇరాన్‌తో యుద్ధం మొదలైన రెండు వారాలకే సీన్ మారిపోయింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా ఉండేందుకు ఇప్పుడు భారత్ సహా అన్ని దేశాలను రష్యా చమురు కొనమని వైట్ హౌస్ బతిమాలుతోంది" అని అరాఘీ పేర్కొన్నారు. అమెరికా వ్యూహాలు ఎంత దారుణంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థమవుతోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఐరోపా దేశాల తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఇరాన్‌పై జరుగుతున్న అక్రమ యుద్ధానికి మద్దతు ఇస్తే.. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా తమకు అండగా ఉంటుందని యూరప్ భ్రమపడుతోందని, ఇది చాలా జాలిగొలిపే విషయమని ఆయన వ్యాఖ్యానించారు.
🏠 Home