న్యూఢిల్లీ: ఉద్యోగాల్లో ఓబీసీ సంపన్న శ్రేణి(క్రీమీలేయర్) రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంపన్న శ్రేణి నిర్ధారణకు కేవలం తల్లిదండ్రుల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే సరిపోదని, ఆ ఉద్యోగాల హోదా, కేటగిరీలను కూడా చూడాలని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ఆదాయం నిర్ణీత పరిధిని దాటినందున వారి పిల్లలు సంపన్నశ్రేణిలోకి వస్తారని, ఓబీసీ రిజర్వేషన్లు వారికి వర్తించవంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ పి.ఎ్‌స.నరసింహ, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ధర్మాసనం తరఫున జస్టిస్ మహదేవన్ తీర్పు రాశారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, తల్లిదండ్రుల ఆదాయం ప్రకారం చూస్తే నాన్‌క్రీమీలేయర్ పరిధిలోకి రారని, అందువల్ల ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవంటూ కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. బాధిత అభ్యర్థులు పలు హైకోర్టులు, ట్రైబ్యునళ్లను ఆశ్రయించగా అనుకూలంగా తీర్పులు వచ్చాయి. వీటిని సవాలు చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. కింది కోర్టుల తీర్పులను సమర్థించిన ధర్మాసనం...కేవలం ఆదాయాన్నే కాకుండా ఉద్యోగాల హోదాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.