Banner
Watermark
కర్ణాటకలో హోటల్ యజమాని ఆత్మహత్య.. సిలిండర్ల కొరతే కారణమా?
📅 24 March 2026, 05:12 PM ✍️ M.Chinna
News Image
కర్ణాటక:కర్ణాటకలోని బెళగావిలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ హోటల్ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా కొన్ని రోజులుగా హోటల్ మూతపడటంతో తన తండ్రి ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడ్డారని కుమారుడు వాపోయాడు. వివరాల్లోకెళితే..



బెళగావిలోని పాత బస్టాండ్ సమీపంలో రామ హల్లూరి అనే వ్యక్తి హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే.. ఇటీవల పశ్చిమాసియాలో నెలొకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లకు కాస్త కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హల్లూరి హోటల్ కొనసాగించలేక కొద్దిరోజులుగా మూసివేశాడు. ఇంతలో అప్పులవాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో అతడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై హల్లూరి కుమారుడు ఉదయ్ స్పందిస్తూ.. తన తండ్రి మరణానికి ఎల్పీజీ కొరతే కారణమని వ్యాఖ్యానించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 'ఎల్పీజీ సిలిండర్లు దొరక్కపోవడంతో కట్టెలు ఉపయోగించి హోటల్ నడపాలనుకున్నాం. వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారో లేదో కచ్చితంగా తెలీదు. కానీ గ్యాస్ సిలిండర్ల సమస్య గురించి మాత్రం ఆయన చాలా ఒత్తిడికి గురయ్యారు' అని ఉదయ్ చెప్పాడు.


హల్లూరి సూసైడ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. అతడు ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగిస్తూ ఓ చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడని అని.. ఒక సిలిండర్ సుమారు వారం నుంచి ఎనిమిది రోజులపాటు వచ్చేదని స్థానికులు చెప్పారన్నారు. అందువల్లే కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండేందుకు అవకాశముందని, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదిలా ఉండగా.. హోటల్ యజమానులకు ఊరటనిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఉన్న కేటాయింపునకు అదనంగా మరో 1,000 సిలిండర్లను చేర్చింది. దీంతో ఆ రాష్ట్రంలో సరఫరా అయ్యే మొత్తం కమర్షియల్ సిలిండర్ల సంఖ్య 10,000కు పెరిగింది.
🏠 Home