Banner
Watermark
'పాకిస్థాన్​లాగా భారత్​ బ్రోకర్ కంట్రీ కాదు'- జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు
📅 26 March 2026, 05:01 PM ✍️ M.Chinna
News Image
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమన్న పాకిస్థాన్‌పై భారత విదేశాంగమంత్రి ఎస్‌. జైశంకర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ఒక దళారీ దేశంగా అభివర్ణించారు. అఖిలపక్ష సమావేశం అనతరం మాట్లాడిన ఆయన పాక్‌ మాదిరి దళారీ దేశంగా భారత్‌ ప్రవర్తించదని స్పష్టంచేశారు. పాక్‌ చేస్తున్న ప్రయత్నాల్లో కొత్తేమీ లేదని అభిప్రాయపడ్డారు. 1981 నుంచి పాకిస్థాన్‌ను అమెరికా ఉపయోగించుకుంటుందన్నారు. భారత్ తన సొంత ప్రయోజనాలను కాపాడుకుంటూనే చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపుతుందని, ఎవరికో మధ్యవర్తిగా పనిచేయడం తమ విధానం కాదని జైశంకర్ పేర్కొన్నారు.

మధ్యవర్తిత్వానికి మేము సిద్ధమే!
అంతకు ముందు, అమెరికా, ఇరాన్ మధ్య అర్ధవంతమైన, వాస్తవికమైన చర్చలను నిర్వహించేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే ఈ సంప్రదింపులను నిర్వహించే అవకాశం లభిస్తే, దాన్నొక గౌరవంగా భావిస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా, ఇరాన్‌ల వైపు నుంచి ఉమ్మడి అంగీకారం లభిస్తే చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ప్రయత్నాలను పాకిస్థాన్ స్వాగతిస్తుందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ట్వీట్ చేశారు.

మధ్యవర్తులుగా పాక్, తుర్కియే, ఈజిప్ట్
రహస్యంగా జరుగుతున్న అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఇటీవలే మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు పాక్ ప్రధాని చేసిన ప్రకటన, ఆ కథనాలకు బలం చేకూర్చేలా ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు.
🏠 Home