దీదీ చేసేవన్నీ 'విక్టిమ్ కార్డ్' రాజకీయాలు- బంగాల్ నుంచి టీఎంసీని తొలగించండి: అమిత్ షా
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. మమత ఎప్పుడూ బాధితురాలిగా (విక్టిమ్ కార్డు పోలిటిక్స్) నటిస్తుంటారని ఆరోపించిన ఆయన, దీదీ ఎత్తుగడలను బంగాల్ ప్రజలు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. శనివారం అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై ఛార్జిషీటు విడుదల చేస్తూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
"మమత బెనర్జీ ఎప్పుడూ బాధితురాలిగా నటిస్తూ రాజకీయాలు చేస్తుంటారు. కొన్ని సార్లు ఆమె కాలు విరగ్గొట్టుకుంటారు. మరికొన్ని సార్లు తలకు కట్టుకుంటారు. కొన్ని సార్లు అనారోగ్యానికి గురవుతారు. ఆపై మళ్లీ ఎన్నికల సంఘం ముందు నిలబడి ఆ సంస్థను దూషిస్తూ నిస్సహాయతను ప్రదర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ విక్టిమ్ కార్డు రాజకీయాలను బంగాల్ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అదే విషయాన్ని ఆమెకు చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను. "
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఎస్ఐఆర్ విషయంలోనూ!"ఇక ఎస్ఐఆర్ విషయానికి వస్తే, కేవలం బంగాల్లోనే న్యాయాధికారులను నియమించారు. దేశంలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. దీనికి కారణం ఏమిటో బంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి. ఆమె ఎస్ఐఆర్పై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ రోజు నేను బంగాల్ ప్రజలను అడుగుతున్నాను. దేశంలోకి చొరబడినవారు బంగాల్ భవిష్యత్‌ను నిర్ణయించేందుకు మనం అనుమతించాలా? నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా, ఓటర్ల జాబితా నుంచే కాదు, దేశం నుంచి కూడా చొరబాటుదారులను వెళ్లగొట్టడమే బీజేపీ పార్టీ అజెండా" అని అమిత్ షా తేల్చిచెప్పారు.