పశ్చిమాసియా ఉద్రిక్తతలను భారత్ పూర్తి శక్తితో ఎదుర్కొంటోంది: మోదీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచం ఆందోళన చెందుతున్న తరుణంలో, భారత్ మాత్రం ఆ సంక్షోభాన్ని పూర్తి శక్తితో ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ తెలిపారు. నిత్యావసరాల కొరత వల్ల ప్రపంచమంతా ఆందోళన చెందుతున్నా, ఆ భారం సామాన్య కుటుంబాలతోపాటు రైతులపై పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ మేరకు నోయిడా ఫేజ్-1 విమానాశ్రయాన్ని శనివారం ప్రారంభించిన మోదీ, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
డబుల్- ఇంజిన్ విధానం ద్వారా ఇది సాధ్యం!
"సమాజ్‌వాదీ పార్టీ నోయిడాను దోపిడీకి ఏటీఎంలా మార్చింది, కానీ నేడు బీజేపీ ప్రభుత్వ హయాంలో యూపీ అభివృద్ధికి చోదక శక్తిగా మారుతోంది. డబుల్- ఇంజిన్ విధానం ద్వారా ఇది సాధ్యమైంది" అని అన్నారు. 2004 నుంచి 2014 వరకు నిలిచిపోయిన విమానాశ్రయ ప్రాజెక్టును ఆలస్యం చేసినందుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలను ఆయన విమర్శిస్తూనే, చివరకు దానికి శంకుస్థాపన చేసి, కార్యరూపం దాల్చినందుకు బీజేపీ -ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
"గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం, గత ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడానికి కూడా అనుమతించలేదు. 2004 నుంచి 2014 వరకు ఇది ఫైళ్లలోనే మరుగునపడిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర్ప్రదేశ్లో ఏ పనీ జరగనివ్వలేదు. కానీ బీజేపీ - ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన జరిగింది, ఇప్పుడు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం. అంతేకాకుండా, దేశంలోని రెండు ప్రధాన సరుకు రవాణా కారిడార్లు దాద్రీలో కలుస్తాయి, దీనివల్ల ఈ ప్రాంతానికి అనుసంధానం మెరుగుపడుతుంది" అని ఆయన అన్నారు.