Banner
Watermark
బంగాల్​లో ఓటర్ల హక్కులకు ముప్పు- ఈసీ చర్యలపై మమత ఫైర్
📅 31 March 2026, 05:15 PM ✍️ M.Chinna
News Image
బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్​ఐఆర్​ ప్రక్రియ పేరుతో నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు మూడు పేజీల లేఖ రాసిన మమత, ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.

"ఒక రాజ్యాంగ సంస్థ నుంచి ఆశించే ప్రమాణాలు ఇవి కావు" అని ఆమె లేఖలో స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడం ఈసీ బాధ్యత అని గుర్తుచేశారు. ఇక బంగాల్‌లో ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగగా, మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదే సమయంలో, బీజేపీపై కూడా మమతా ఘాటు విమర్శలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ ఓటర్లను బంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బిహార్, రాజస్థాన్, హరియాణా, ఉత్తర​ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

బీజేపీకి బంగాల్​ ప్రజలపై గౌరవం లేదు!
పశ్చిమ మేదినిపుర్ జిల్లా చంద్రకోణాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన మమతా, ఒక్క రోజులోనే సుమారు 30 వేల కొత్త ఓటర్ల నమోదు ఫారాలు సమర్పించారని తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో అభిషేక్ బెనర్జీ తన ప్రచారాన్ని మధ్యలో వదిలి ఈసీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీకి బంగాల్ ప్రజలపై గౌరవం లేదని, ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉందని మమతా విమర్శించారు. SIR ప్రక్రియ పేరుతో మహిళలు, మైనారిటీల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు.
🏠 Home