ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కాంగ్రెస్ నేత, ఆయన డ్రైవర్ మృతి
📅 03 April 2026, 03:58 PM
✍️ M.Chinna
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణించిన ఎస్‌యూవీ వాహనం టైర్ రిపేర్ కోసం రోడ్డు పక్కన నిలిచి ఉన్నది. ఒక లారీ వెనుక నుంచి ఆ వాహనాన్ని ఢీకొట్టింది. కాంగ్రెస్ నేతతో పాటు డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించారు. పంజాబ్ కాంగ్రెస్ నేత ఖుష్‌బాజ్ సింగ్ జట్టానా తన ఎస్‌యూవీ వాహనంలో ప్రయాణించారు. గురువారం రాత్రి కుండ్లీ-ఘజియాబాద్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా ఆ వాహనం టైర్‌లో గాలిపోయింది. దీంతో రిపేర్ కోసం ఆ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు.కాగా, వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న ఎస్‌యూవీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖుష్‌బాజ్ జట్టానాతో పాటు ఆయన డ్రైవర్ పర్మిందర్ సింగ్ మరణించారు. ఆయన గన్‌మ్యాన్‌కు గాయాలయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. ఖుష్‌బాజ్ జట్టానా వాహనాన్ని ఢీకొట్టిన లారీని గుర్తించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.