అసెంబ్లీ ఎన్నికల వేళ- రాజకీయ లబ్ది కోసమే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు: BJPపై కాంగ్రెస్ విమర్శలు
మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. బంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని విమర్శించింది. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించేందుకు ఇలా చేస్తోందని వ్యాఖ్యానించింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఘోరంగా ఉల్లంఘించడమేనని మండిపడింది. తొందరపాటుతో నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్) జైరాం రమేశ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
"నారీ శక్తి వందన అధినియమ్- 2023 బిల్లు ఆమోదం పొంది 30 నెలల అయ్యింది. ఇంతకాలం ప్రభుత్వం నిద్రపోయిందా? ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం ఇలా చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం గానీ, ప్రతిపాదన గానీ రాలేదు. అయితే అనధికారికంగా లోక్‌సభ సీట్లలో దామాషా ప్రకారం పెరుగుదల ఉంటుందని మాకు తెలిసింది. దామాషా ప్రకారం లోక్‌సభ సీట్లలో పెరుగుదల ఉంటుందని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి చిన్న రాష్ట్రాలు, అలాగే దక్షిణ, ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ప్రతిపాదిత బిల్లుతో ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ సీట్లు 120కి పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో లోక్‌సభలో సీట్ల సంఖ్య గరిష్ఠంగా 40కి మాత్రమే చేరుకుంటుంది. అనధికారికంగా మాకు అందిన సమాచారం ప్రకారం దామాషా ప్రకారం లోక్‌సభ సీట్ల పెంపు చాలా రాష్ట్రాలకు ప్రమాదకరం" అని జైరాం రమేశ్ తెలిపారు.