Banner
Watermark
మాల్దా నిర్భంధం మాస్టర్​మైండ్​ మొఫక్కురల్‌ ఇస్లాం అరెస్ట్​- రంగంలోకి దిగిన NIA
📅 03 April 2026, 04:56 PM ✍️ M.Chinna
News Image
బంగాల్‌లో అధికారుల నిర్బంధం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఆగ్రహంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌ఐఏ దర్యాప్తునకు సిఫార్సు చేసింది. మరోవైపు ఎస్‌ఐఆర్‌ కోసం వెళ్లిన జ్యుడిషియల్‌ అధికారుల నిర్బంధంపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలు పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

ప్రధాన సూత్రధారి మొఫక్కురల్‌ ఇస్లాం సహా అతడి సహాయకుడి అరెస్టు
బంగాల్‌లోని మాల్దాలో SIRలో పాల్గొన్న న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనలో ప్రధాన సూత్రధారి మొఫక్కురల్‌ ఇస్లాం సహా అతడి సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాది మొఫక్కురల్‌ ఇస్లాం విమానం ఎక్కి పారిపోయేందుకు బగ్డోగ్రా విమానాశ్రయానికి వెళ్లిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. స్థానికులను ప్రసంగాలతో రెచ్చగొట్టి ఏడుగురు అధికారుల నిర్బంధానికి కారణమైన ఇస్లాంపై మూడు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఈ ఘటనపై 19 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. NIA ఈ కేసును విచారిస్తున్నప్పటికీ తాము కూడా దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించారు. అధికారుల నిర్బంధం పక్కా ప్రణాళికతో చేశారా లేదా అన్న కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. మోతాబరి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ సభ్యుడు మౌలానా షాజహాన్ అలీతో పాటు ఈ కేసులో ఇప్పటివరకు 35 మందిని అరెస్టు చేశారు. అటు మాల్దా హింసాకాండ కేసుపై NIA కూడా దర్యాప్తు ప్రారంభించింది. కోల్‌కతా కార్యాలయం నుంచి NIA బృందం మాల్దాకు బయలుదేరింది. ముందుగా పోలీసుల నుంచి అన్ని వివరాలను సేకరించే అవకాశం ఉంది.

తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం
మరోవైపు ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. అధికారుల నిర్బంధం ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దీని వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘం కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం పన్నుతున్న వ్యూహంలో భాగంగానే ఈ అలజడిని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక తన అధికారాలు తగ్గిపోయాయని, అందుకే యంత్రాంగంపై పట్టు కోల్పోయానని మమతా వివరించారు. బోగస్ ఓటర్లను తొలగిస్తుండటంతో భయం పట్టుకున్న టీఎంసీ, ఉద్దేశపూర్వకంగానే ఈ అరాచకానికి పాల్పడిందని బీజేపీ విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, మాల్దాతో పాటు జల్​పాయ్‌గుఢి, కూచ్ బెహర్, పూర్బా బర్ధమాన్ వంటి జిల్లాల్లో కూడా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఓటర్ల సవరణ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
🏠 Home