• Other News
  • Live TV
  • ముర్మునే మాత్రమే కాకుండా దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించింది బంగాల్ సర్కార్: మోదీ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 8, 2026, 4:52 pm
    ముర్మునే మాత్రమే కాకుండా దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించింది బంగాల్ సర్కార్: మోదీ

    రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బంగాల్ పర్యటనలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. దిల్లీలోని పలు ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు బంగాల్​లోని టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రపతిని తీవ్రంగా అవమానించిందని ఆరోపించారు. ఒక్క ముర్మునే మాత్రమే కాకుండా దేశాన్ని, రాజ్యాంగాన్ని కూడా అవమానించిందని మండిపడ్డారు.గిరిజన సమాజానికి చెందిన ముఖ్యమైన కార్యక్రమాన్ని టీఎంసీ బహిష్కరించిందని అన్నారు. రాష్ట్రపతికి గౌరవం ఇవ్వడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సంతాల్ గిరిజన సమాజానికి ఆ వేడుక ఎంతో ప్రాధాన్యం కలిగినదని, రాష్ట్రపతి ముర్ము కూడా గిరిజన సమాజం నుంచే వచ్చిన నాయకురాలని గుర్తుచేశారు. గిరిజనుల సంక్షేమం పట్ల ఆమెకు ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. "దేశం అంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో, రాష్ట్రపతికి తగిన గౌరవం ఇవ్వకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు జరిగిన అవమానం" అని ప్రధాని అన్నారు.ఇక మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లక్షపతి దీదీ కార్యక్రమాన్ని ప్రధాని ప్రస్తావించారు. కొన్ని సంవత్సరాల క్రితం మూడు కోట్ల మహిళలను లక్షపతి దీదీలుగా తీర్చిదిద్దుతామని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అప్పట్లో చాలామంది దీనిని రాజకీయ హామీగా తీసుకున్నారని, అయితే ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా మహిళలు లక్షపతి దీదీలుగా ఎదిగారని మోదీ తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా బలపడుతున్నారని పేర్కొన్నారు.
    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అపారమని, సమాజాన్ని ముందుకు నడిపించడంలో వారు కీలక శక్తిగా నిలుస్తున్నారని అన్నారు. మహిళలు దేశానికి కొత్త శక్తిని అందిస్తూ అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దిల్లీ అభివృద్ధిపై కూడా ప్రధాని మాట్లాడారు. ఏడాది క్రితం దిల్లీ ప్రజలు కొత్త ఆశలు, సంకల్పంతో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పటి నిర్ణయం ఫలితంగా రాజధానిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు.దిల్లీలో రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. గత దశాబ్దంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రాజెక్టులు ఫైళ్లలోనే నిలిచిపోయాయని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వాన్ని ఆపద ప్రభుత్వంగా పేర్కొంటూ, ప్రజల సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow