• Other News
  • Live TV
  • ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను.. ఇరాన్‌కు ఆర్థిక వెన్నెముకగా నిలుస్తున్న ‘ఖర్గ్‌’ ఐలాండ్‌

    Reporter
    Journalist Chinna Telangana  |  March 10, 2026, 1:02 pm
    ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను.. ఇరాన్‌కు ఆర్థిక వెన్నెముకగా నిలుస్తున్న ‘ఖర్గ్‌’ ఐలాండ్‌

    అమెరికా-ఇజ్రాయెల్‌,: ఇరాన్‌ మధ్య పది రోజుల కిందట మొదలైన ఉద్రిక్తతలు చమురు నిక్షేపాల ధ్వంసంతో మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్‌ను గట్టిగా దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ‘ఖర్గ్‌ ద్వీపం’పై దాడులకు ట్రంప్‌ యోచిస్తున్నట్టు సమాచారం.
    ఏమిటీ ద్వీపం? ఎందుకంత ప్రాధాన్యం??
    పశ్చిమాసియాలోని పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ‘ఖర్గ్‌’ ఉంటుంది. 20 చదరపు కిలోమీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్నప్పటికీ.. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా చెప్తారు. ఇరాన్‌ చమురు ఎగుమతుల్లో 90 శాతం వాటా దీనిదే. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతుల ద్వారా ఇరాన్‌ 78 బిలియన్‌ డాలర్లను ఆర్జించింది. దీన్ని బట్టి ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇక్కడి చమురు ఎగుమతులే కీలకమన్న విషయం అర్థమవుతున్నది. ఖర్గ్‌లోని లోడింగ్‌ టర్మినళ్లు రోజుకు ఏడు మిలియన్‌ బ్యారెళ్ల చమురును హ్యాండిల్‌ చేయగలవని నివేదికలు చెప్తున్నాయి.
    ట్రంప్‌ దృష్టి ఎందుకంటే??
    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలుకావడానికి ముందు ఖర్గ్‌ నుంచి రోజుకు 1.5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్‌.. ఘర్షణలు మొదలైన తర్వాత ఈ ఎగుమతులను 4 మిలియన్‌ బ్యారెళ్లకు పెంచింది. యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే ఇలా చేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఖర్గ్‌లో ఉత్పత్తి అవుతున్న చమురు ఎగుమతితో ఆర్థికంగా బలోపేతమవుతున్న ఇరాన్‌ను.. దీర్ఘకాలంలో దెబ్బతీయలేమని ట్రంప్‌ గ్రహించినట్టు వినికిడి. ఈ క్రమంలోనే ఆ ద్వీపంపై దాడులు జరిపి ఇరాన్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం.

    📰 e-Paper Clip
    Google News Follow