అమెరికా సైనిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ వ్యూహాత్మకంగా హర్ముజ్ జలసంధిని మూసివేసే అవకాశాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన యంత్రాంగం తక్కువగా అంచనా వేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ తన నివేదికలో పేర్కొంది. యుద్ధం కోసం అమెరికా సైన్యం అత్యవసర ప్రణాళికలను వేసిందని వెల్లడించింది. అయితే హర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందని పెంటగాన్, జాతీయ భద్రతా మండలి ఊహించలేదని తెలిపింది. ఇరాన్‌పై సైనిక ఆపరేషన్ ప్రారంభానికి ముందు యూఎస్ ఇంధన, ట్రెజరీ శాఖల అధికారులు కొన్ని ప్రణాళికా సమావేశాలలో పాల్గొన్నారని స్పష్టం చేసింది. కానీ ఆ సమావేశాలు వివరణాత్మక ఆర్థిక అంచనాలు, ఇంటర్ ఏజెన్సీ విశ్లేషణ చర్చలకు కేంద్రంగా లేవని పేర్కొంది.
'అందుకోసమే హర్ముజ్ జలసంధి మూసివేత'
అయితే హర్ముజ్ జలసంధి తమకు ఎంత ముఖ్యమో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తొలి సందేశంలోనే వివరించారు. హర్మూజ్ జలసంధి మూసివేత ఇకపై కూడా కొనసాగుతుందని వెల్లడించారు. శత్రువులపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే జలసంధిలో రవాణా అడ్డుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలను కచ్చితంగా ఉపయోగించుకోవాలని తమ దేశ సైనికులను సూచించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి భవిష్యత్తులో దాడులకు గురయ్యే అవకాశం ఉన్న ప్రదేశాలను ఇరాన్ గుర్తించిందని అన్నారు. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని, వాటిని తక్షణమే మూసివేయాలని వార్నింగ్ ఇచ్చారు.