• Other News
  • Live TV
  • అధికారిక కార్యక్రమాల్లో ఆ గీతం తప్పనిసరి కాదు

    Reporter
    Journalist Chinna Telangana  |  March 25, 2026, 4:51 pm
    అధికారిక కార్యక్రమాల్లో ఆ గీతం తప్పనిసరి కాదు

    ప్రభుత్వ ఉత్తర్వులలో ఎలాంటి శిక్షార్హమైన చర్యలు పేర్కొననందున ఈ పిటిషన్‌పై విచారణ తొందరపాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ ఏడాది జనవరి 28న కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ కేవలం సలహా మాత్రమేనని, దాన్ని పాటించకపోతే శిక్షలు ఉంటాయని ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం పేర్కొన్నది.ఒకవేళ శిక్షార్హమైన చర్యలు తీసుకుంటే లేదా దాన్ని తప్పనిసరి చేస్తే అప్పుడు విచారిస్తామని, ప్రస్తుతానికి దానిలో అలాంటివేమీ లేవని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే.. సర్క్యులర్‌లో శిక్షలు లేకపోయినా ఇది పరోక్ష ఒత్తిడికి దారితీస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వందేమాతరం పాడటానికి లేదా గౌరవ సూచకంగా నిలబడటానికి నిరాకరించే వారు సామాజిక వివక్షను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వాదించారు.దేశభక్తిని బలవంతంగా రుద్దలేరని, వ్యక్తిగత అంతరాత్మను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ఉందని ఆయన నివేదించారు. అయితే పిటిషనర్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ప్రస్తుతానికి ఊహాజనితమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవేళ ఎవరిపైనైనా శిక్షార్హమైన చర్యలు తీసుకున్నా లేదా వివక్ష చూపినా, అప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. విద్యాసంస్థలు, బహిరంగ సభల్లో వందేమాతరం పాడాలని కేంద్రం సర్క్యులర్‌లో పేర్కొన్నది.

    📰 e-Paper Clip
    Google News Follow