దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీకి ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసర కొనుగోళ్లకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని, అన్ని పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తున్నాయని కేంద్రం తెలిపింది.
అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి!
ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం వెంటనే స్పందించి స్పష్టత ఇచ్చింది. ప్రజలు అపోహలకు లోనవ్వకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. వ్యూహాత్మక నిల్వలను కలుపుకుంటే మొత్తం 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా దేశంలోని అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పేర్కొంది. భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం కలిగిన దేశంగా నిలిచిందని కేంద్రం గుర్తుచేసింది. అంతేకాకుండా ఐదో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా కూడా భారత్ స్థానం సంపాదించిందని తెలిపింది. దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా 150కి పైగా దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాలను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది.
అవసరమైతే విదేశాల నుంచి కూడా కార్గోలను!
ఎల్‌పీజీ విషయంలో కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుకు సుమారు 50 లక్షల గ్యాస్ సిలిండర్లను చమురు సంస్థలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని వివరించింది. అలాగే అవసరమైతే విదేశాల నుంచి కూడా కార్గోలను దిగుమతి చేసుకుంటూ నిల్వలను పుష్కలంగా ఉంచుతున్నట్లు తెలిపింది.
ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం కారణంగానే కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద క్యూ లు కనిపిస్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. మరోవైపు పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. మార్కెట్లో పీఎన్‌జీ తక్కువ ధరకు లభించడమే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలమని తెలిపింది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ప్రజలు పీఎన్‌జీకి మారాలని సూచించింది. దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు పేర్కొంది.