బంగాల్: బంగాల్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) విచారణ తర్వాత రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈ జాబితాలను ఈసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
వివరాలు వెల్లడించని ఈసీ
శుక్రవారం రాత్రి 11:30 గంటలకు వైబ్సైట్లో బూత్‌వారీగా ఓటర్ల వివరాలు అందుబాటులో ఉంచారు. కానీ చేర్పులు, తొలగింపులపై సమాచారం ఇవ్వలేదు. రెండో జాబితా విడుదల చేశామని, అంతకు మించి వరాలు చెప్పలేమని ఈసీ అధికారులు పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలు కారణంగా డేటా అందుబాటులో లేదని చెప్పారు. మరోవైపు ఎన్నికల కోసం బంగాల్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మొదటి జాబితాలోనూ సేమ్
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తర్వాత బంగాల్‌లో తొలి సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను ఈసీ మార్చి 23 (సోమవారం) రాత్రి విడుదల చేసింది. ఇందులో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను పొందుపరిచారు. ఈ జాబితాను ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అప్పుడు కూడా ఎంత మంది పేర్లు తొలగించారు, ఎంత మంది కేసులు పరిష్కరించారనే వివరాలను ఇవ్వలేదు. దీంతో రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఫిబ్రవరి 28న ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలోని దాదాపు 60 లక్షల మంది ఓటర్ల పేర్లపై దర్యాప్తు జరుగుతోందని ఈసీ తెలిపింది. వీటిపై విచారణ కోసం అప్పట్లో 705 మంది జ్యుడీషియల్ అధికారులను నియమించింది. ఈ అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి నకిలీ, అసలైన ఓటర్ల వివరాలను గుర్తించారు. స్క్రీనింగ్ పరిధిలో ఉన్న ఆ 60 లక్షల మంది ఓటర్లలో 29 లక్షల మందిపై విచారణ పూర్తయిందని బంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ సోమవారం సాయంత్రం వెల్లడించారు. ఈ ఓటర్ల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నామని పలువురు అంటున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అధికార టీఎంసీ పార్టీ నుంచి విముఖ వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ ఈసీ విడుదల చేసిన రెండు అనుబంధ ఓటర్ల జాబితాలో ఎంతమంది పేర్లను జాబితాలో ఉంచారు, తొలగించారు అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.