• Other News
  • Live TV
  • ''బ్లూ బుక్‌' నిబంధనలు పాటించలేదు- వివరణ ఇవ్వండి'- బంగాల్ సర్కార్​కు కేంద్రం లేఖ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 8, 2026, 4:55 pm
    ''బ్లూ బుక్‌' నిబంధనలు పాటించలేదు- వివరణ ఇవ్వండి'- బంగాల్ సర్కార్​కు కేంద్రం లేఖ

    బంగాల్‌లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ లోపాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో లోపాలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఏర్పాట్లపై వివాదం నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం బంగాల్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలలోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది.

    బంగాల్ ముఖ్య కార్యదర్శికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాసిన లేఖలో రాష్ట్రపతి ముర్ము పర్యటన సమయంలో భద్రత, ప్రోటోకాల్, వేదిక ఏర్పాట్లు, మార్గ ఏర్పాట్లలో జరిగిన ఉల్లంఘనలపై పూర్తి వివరణ కోరారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించిన నియమాలు వివరించే గోప్య పత్రం అయిన బ్లూ బుక్ నిబంధనలు పాటించలేదని కేంద్రం అభిప్రాయపడింది.

    రాష్ట్రపతి అసంతృప్తి
    సిలిగుడి సమీపంలోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం వద్ద శనివారం జరిగిన గిరిజన సమాజ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం, ఏర్పాట్లు సరిగా లేకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్యక్రమం వేదికను ముందుగా నిర్ణయించిన బిధన్నగర్ నుంచి గోషాయిపుర్ ప్రాంతానికి మార్చడం సరైన నిర్ణయం కాదని ప్రశ్నించారు. "కార్యక్రమం బిధన్నగర్‌లో జరిగి ఉంటే మరింత మంది పాల్గొనేవారు. అక్కడ విస్తారమైన స్థలం ఉంది. కానీ ఎందుకు అక్కడ అనుమతి ఇవ్వలేదో నాకు తెలియదు. ఇక్కడికి ప్రజలు రావడం కష్టంగా ఉంది" అని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే తన పర్యటన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర మంత్రులు ఎవరూ హాజరు కాకపోవడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. "మమతా బెనర్జీ నా చిన్న చెల్లెల్లాంటివారు. నేను కూడా బంగాల్​ కూతురినే. ఆమె ఎందుకు రాలేదో తెలియదు. కానీ అది పెద్ద విషయం కాదు. మీ అందరూ సంతోషంగా ఉండాలి" అని రాష్ట్రపతి అన్నారు.

    ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ప్రశ్నలు
    కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రపతి బంగాల్​కు చేరుకున్న సమయంలో ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శి, డీజీపీ వంటి ఉన్నతాధికారులు విమానాశ్రయంలో లేరు. ఇది బ్లూ బుక్ ప్రోటోకాల్‌కు విరుద్ధమని కేంద్రం పేర్కొంది. విమానాశ్రయంలో రాష్ట్రపతిని స్వాగతించడానికి కేవలం సిలిగుడి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే హాజరయ్యారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీరు లేకపోవడం కూడా ప్రోటోకాల్ లోపంగా పేర్కొంటూ వివరణ కోరారు. రాష్ట్రపతి ప్రయాణించిన మార్గంలో చెత్త కనిపించిందని కూడా కేంద్రం గమనించింది. ఈ ఘటనకు సంబంధించి డార్జిలింగ్ జిల్లా కలెక్టర్, సిలిగురి పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా కలెక్టర్​పై ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

    📰 e-Paper Clip
    Google News Follow