• Other News
  • Live TV
  • తృణమూల్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి

    Reporter
    Journalist Chinna Telangana  |  March 13, 2026, 4:32 pm
    తృణమూల్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి

    న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. పశ్చిమబెంగాల్‌లో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు 12 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరింది. అయితే ఇంతవరకూ తమకు ఎలాంటి సమాధానం రాలేదని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ శుక్రవారంనాడు తెలిపారు.
    రాష్ట్రపతి అపాయిమెంట్ కోరుతూ టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ఈనెల 9న లేఖ రాశారని, అయితే ఎలాంటి సమాధానం రాలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సమయాభావం కారణంగా రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇటీవల 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి సిలిగుడికి వెళ్లిన సమయంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. దీనిపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు.
    రాష్ట్రపతి పర్యటన సమయంలో ముఖ్యమంత్రి నుంచి కానీ, మంత్రుల నుంచి కానీ ఆమెకు అధికారిక స్వాగతం లభించలేదు. ఈవెంట్ ఏర్పాటు, వెన్యూ ఎంపిక తదితర అంశాలపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేసారు. తాను కూడా బెంగాల్ ఆడపడుచునేనని, బహుశా తనపై సీఎంకు కోపం ఉందేమోనని అన్నారు. బీజేపీ సైతం ఈ చర్యను తప్పుపట్టింది. అయితే, రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగలేదని, ముందస్తు సమాచారం లేదని మమతా బెనర్జీ తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్రపతి పర్యటనపై కూడా ఆమె సందేహాలు వ్యక్తం చేశారు.

    📰 e-Paper Clip
    Google News Follow