• Other News
  • Live TV
  • గల్ఫ్‌ దేశాలపై దాడులను ఖండిస్తున్నాం

    Reporter
    Journalist Chinna Telangana  |  March 14, 2026, 4:25 pm
    గల్ఫ్‌ దేశాలపై దాడులను ఖండిస్తున్నాం

    న్యూఢిల్లీ, మార్చి 13: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ మిత్రదేశం చైనా నుంచి అనూహ్య స్పందన వచ్చింది. గల్ఫ్‌ దేశాలపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు, పౌరులు, సైనికేతర లక్ష్యాలపై విచక్షణారహిత దాడులను ఖండిస్తున్నట్లు డ్రాగన్‌ దేశం పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ మాట్లాడుతూ.. గల్ఫ్‌ ప్రాంత దేశాలపై దాడులకు చైనా మద్దతివ్వదన్నారు. సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయడం, ఘర్షణలు మరింత వ్యాప్తి చెందకుండా నివారించడం ప్రస్తుతం అత్యవసర ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి చర్చలు, సంప్రదింపులే ఏకైక ఆచరణీయమైన పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ సంబంధాల విషయంలో ప్రాథమిక నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ ఇటీవల గల్ఫ్‌ రీజియన్‌లోని పలు దేశాల నేతలతో మాట్లాడారని తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించాలని, శత్రుత్వానికి ముగింపు పలకాలని కోరినట్లు వెల్లడించారు. ఘర్షణ ప్రారంభం నుంచే కాల్పుల విరమణకు, రాజకీయ పరిష్కారానికి పిలుపునిచ్చినట్లు చైనా పునరుద్ఘాటించింది. పశ్చిమాసియా వ్యవహారాలపై చైనా ప్రభుత్వ ప్రత్యేక రాయబారి ప్రస్తుతం ఆ రీజియన్‌లో ఉన్నారని, ఇరుపక్షాల మధ్య చర్చలను ప్రోత్సహించే లక్ష్యంతో దౌత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు గువో జియాకున్‌ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశంగా, పశ్చిమాసియా దేశాల స్నేహితుడిగా చైనా ఎల్లప్పుడూ శాంతిని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో పొరుగు దేశాలపై ఇరాన్‌ దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేసిన తీర్మానంపై ఓటింగ్‌కు చైనా దూరంగా ఉండడం గమనార్హం.

    📰 e-Paper Clip
    Google News Follow