• Other News
  • Live TV
  • బంగాల్‌ సీఎస్‌పై ఈసీ వేటు- హోంశాఖ కార్యదర్శి, డీజీపీ బదిలీ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 16, 2026, 12:46 pm
    బంగాల్‌ సీఎస్‌పై ఈసీ వేటు- హోంశాఖ కార్యదర్శి, డీజీపీ బదిలీ

    బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు కీలక సీనియర్ అధికారులను పదవుల నుంచి తప్పిస్తూ కొత్త నియామకాలు ప్రకటించింది. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
    మార్చి 15 తేదీన కోల్‌కతాలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం ఒక లేఖ పంపింది. ఆ లేఖలో బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన అనంతరం, ఆ బదిలీలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఆదేశాల ప్రకారం 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నరియాలాను రాష్ట్ర ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించాలని తెలిపింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న నందిని చక్రబర్తిని ఆ పదవి నుంచి తప్పించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెను ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన బాధ్యతల్లోనూ నియమించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.అదే విధంగా మరో కీలక మార్పుగా 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంగమిత్ర ఘోష్‌ను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఈ నియామకాలు వెంటనే అమలులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం కార్యదర్శి సుజీత్ కుమార్ మిశ్రా సంతకంతో జారీ చేసిన ఆదేశాల్లో ఈ మార్పులను వెంటనే అమలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు తమ బాధ్యతలు స్వీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నివేదిక సమర్పించాలని కూడా సూచించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ తరువాత రాష్ట్ర పరిపాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షణ చేపడుతుంది. తాజాగా బంగాల్ డీజీపీని మార్చింది. పీయూష్ పాండే స్థానంలో సిద్ధ్ నాథ్ గుప్తాను డీజీపీగా నియమించింది. సుప్రతిమ్ సర్కార్ స్థానంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా అజయ్ కుమార్ నంద్‌ను నియమించింది.

    📰 e-Paper Clip
    Google News Follow