: భారత్, పాకిస్థాన్ సంబంధాలకు ఇప్పటికీ అణ్వస్త్ర సంఘర్షణ ముప్పు ఉందని అమెరికా నిఘా వర్గాల వార్షిక ముప్పు అంచనా నివేదిక హెచ్చరించింది. భారత్, పాక్‌లు బహిరంగంగా సైనిక ఘర్షణను కోరుకోవడం లేదని, అయితే ఉగ్రవాద సంస్థలు పహల్గాం తరహా ఉగ్రదాడులను చేసి సైనిక సంక్షోభాన్ని సృష్టించే పరిస్థితులు నేటికీ ఉన్నాయని తెలిపింది. ఈమేరకు వివరాలతో కూడిన 34 పేజీల నివేదికను అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్ బుధవారం సెనెట్‌కు సమర్పించారు. పాకిస్థాన్ అభివృద్ధిచేస్తున్న లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లకు అమెరికాను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉందని అమెరికా సెనెట్‌కు ఆమె తెలిపారు.
ఉగ్రదాడులతో సైనిక సంక్షోభాన్ని సృష్టించే ముప్పు
'2025 సంవత్సరంలో భారత్‌లోని జమ్మూకశ్మీరులో ఉన్న పహల్గాంలో ఉగ్రదాడి జరిగాక భారత్, పాక్ సైనిక ఘర్షణ తీవ్రరూపు దాల్చింది. ఆ రెండు అణ్వస్త్ర దేశాలు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రదాడులు కూడా సైనిక ఘర్షణకు దారితీస్తాయని ఆ పరిణామాలతో నిరూపితమైంది. ప్రస్తుతం భారత్, పాక్‌లు బహిరంగంగా సైనిక ఘర్షణను కోరుకోవడం లేదు. కానీ ఉగ్రవాద సంస్థలు మళ్లీ ఉగ్రదాడులను చేసి, సైనిక సంక్షోభాన్ని సృష్టించే పరిస్థితులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి' అని అమెరికా నిఘా వర్గాల వార్షిక ముప్పు అంచనా నివేదిక హెచ్చరించింది.