న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ఖండాలు దాటింది. హిందూ మహాసముద్రం దిశగా ఆ యుద్ధం వెళ్తోంది. ఆ సముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా-యూకే మిలిటరీ బేస్ డీగో గార్సియాపై ఇరాన్ తాజాగా రెండు బాలిస్టిక్ క్షిపణుల(Iran Missiles)ను ఫైర్ చేసినట్లు తెలిసింది. దీనిపై అమెరికా మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ క్షిపణులు టార్గెట్ చేరుకోలేదని భావిస్తున్నారు. ఓ క్షిపణి మార్గమధ్యంలోనే విఫలమైంది. మరో మిస్సైల్‌ను ఇంటర్‌సెప్టార్ కూల్చివేసినట్లు మీడియా కథనం ద్వారా తెలుస్తోంది.
అయితే ఇరాన్ భూభాగానికి సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఛాగోస్ దీవులు ఉన్నాయి. చాలా దూరం ఉన్న అమెరికా బేస్‌ను ఇరాన్ టార్గెట్ చేసినట్లు కథనాలు వస్తున్నా.. దాంట్లో వాస్తవం ఎంతో తెలియడం లేదు. ఒకవేళ ఇదే నిజం అయితే అప్పుడు యూరోప్‌లోని బేస్‌లను కూడా ఇరాన్ టార్గెట్ చేసే రేంజ్‌లో ఉన్నట్లు అనుమానించవచ్చు. కానీ ఇప్పటి వరకు ఈ క్షిపణి దాడి గురించి పెంటగాన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
హిందూ మహాసముద్రం మధ్య భాగంలో ఉన్న డీగో గార్సియా దీవులను ఇరాన్ టార్గెట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిజమైతే, అప్పుడు ఈ యుద్ధం హద్దులు దాటినట్లు అవుతుందని, ఇదొక రకంగా పశ్చిమ దేశాలకు బలమైన సంకేతమే అని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌పై దాడులు చేపట్టినప్పుడు డీగో గార్సియా బేస్‌ను అమెరికా వాడుకున్నది.