• Other News
  • Live TV
  • హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు- భారత్ LPG ట్యాంకర్లు కదులుతున్నాయా?

    Reporter
    Journalist Chinna Telangana  |  March 21, 2026, 12:08 pm
    హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు- భారత్ LPG ట్యాంకర్లు కదులుతున్నాయా?

    పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత 24 గంటలుగా ఆ కీలక మార్గంలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అదే సమయంలో భారత్​కు చెందిన రెండు ఎల్పీజీ ట్యాంకర్లు ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
    వందలాది నౌకలు తీర ప్రాంతాల్లోనే!
    ప్రపంచ ఇంధన సరఫరాల్లో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధి ద్వారా దాదాపు 20 శాతం చమురు, సహజ వాయువు సరఫరాలు జరుగుతుంటాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఆ మార్గంలో నౌకా రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. గల్ఫ్ ప్రాంతం నుంచి బయలుదేరే నౌకలను లక్ష్యంగా చేసుకోవచ్చని తెహ్రాన్ సంకేతాలు ఇవ్వడంతో వందలాది నౌకలు తీర ప్రాంతాల్లోనే నిలిచిపోయాయి.
    ఈ నేపథ్యంలో భారత్​కు చెందిన ఎల్పీజీ ట్యాంకర్లు పైన్ గ్యాస్, జాగ్ వసంత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా తీరానికి సమీపంలో ఉన్నట్లు నౌకా ట్రాకింగ్ డేటా వెల్లడించింది. ఆ రెండు నౌకలు ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. శనివారం వీటి ప్రయాణం ప్రారంభమయ్యే అవకాశముందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు. కాగా, భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి రాజేశ్ కుమార్ సిన్హా ఆ విషయంపై స్పందిస్తూ, ట్యాంకర్ల కదలికలపై పూర్తి వివరాలు తమ వద్ద లేవని తెలిపారు. అయితే పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని సంకేతాలు ఇచ్చారు.
    మరోవైపు, ఈ ప్రాంతంలో ఉన్న భారత నౌకల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు చెందిన 22 నౌకలు ఉన్నట్లు సమాచారం. వీటి సురక్షిత రాకపోకలకు చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. "భారత నౌకలు సురక్షితంగా, అడ్డంకుల్లేకుండా ప్రయాణించేందుకు మేము కట్టుబడి ఉన్నాం" అని విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అంతర్జాతీయ నాయకులతో కూడా ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

    📰 e-Paper Clip
    Google News Follow