• Other News
  • Live TV
  • 48 గంటల డెడ్‌లైన్‌.. హొర్ముజ్‌ తెరవకపోతే ఇరాన్‌ పవర్‌ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం

    Reporter
    Journalist Chinna Telangana  |  March 23, 2026, 12:18 pm
    48 గంటల డెడ్‌లైన్‌.. హొర్ముజ్‌ తెరవకపోతే ఇరాన్‌ పవర్‌ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం

    వాషింగ్టన్‌, : యుద్ధాన్ని ముగించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన మరునాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. 48 గంటల్లోగా హొర్ముజ్‌ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ‘హొర్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్‌కు ఇది సరైన సమయం’ అని తన ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు. టెహ్రాన్‌కు మంగళవారం ఉదయం 5.14 గంటల (భారత కాలమాన ప్రకారం) వరకు సమయం ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఇరాన్‌ తమ హెచ్చరికలను పట్టించుకోకుండా 48 గంటల్లో హొర్ముజ్‌ను తెరవకపోతే ఆ దేశంలోని అతి పెద్ద విద్యుత్తు ప్లాంట్‌ ధ్వంసంతో పని ప్రారంభించి మొత్తం ప్లాంట్లను తుడిచిపెట్టేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.మీ సదుపాయాలపై విరుచుకుపడతాంట్రంప్‌ అల్టిమేటంపై ఇరాన్‌ మిలిటరీ స్పందించింది. ట్రంప్‌ తమ విద్యుత్తు ప్లాంట్లపై దాడి చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికాకు చెందిన అన్ని ఇంధన, సాంకేతిక, ఉప్పునీటి శుద్ధి మౌలిక సదుపాయాలు లక్ష్యంగా తాము దాడి చేస్తామని ఇరాన్‌ మిలిటరీ ఆపరేషనల్‌ కమాండ్‌ ఖైతమ్‌ అల్‌-అన్బియా తెలిపింది. అలాగే హొర్ముజ్‌ను పూర్తిగా మూసివేస్తామని, ప్లాంట్లను తిరిగి నిర్మించేంత వరకు మళ్లీ తెరువబోమని హెచ్చరించింది. అయితే అంతకుముందు శత్రుదేశాలకు చెందిన నౌకలు తప్ప మిగిలిన అన్నింటినీ హొర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఇస్తున్నట్టు ఇరాన్‌ తెలిపింది. అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇరాన్‌ ప్రతినిధి అలీ మౌసవి ఆదివారం మాట్లాడుతూ ఇరాన్‌ శత్రు దేశాలతో సంబంధం లేని నౌకలన్నింటినీ జలసంధి గుండా భద్రంగా, సురక్షితంగా వెళ్లే ఏర్పాట్లను టెహ్రాన్‌ చేసిందని తెలిపారు. సముద్ర రవాణా భద్రతను పెంచడానికి, గల్ఫ్‌లో సముద్రయాన సిబ్బందిని రక్షించడానికి ఐరాసతో సహకరించడానికి తాము సిద్ధమేనని చెప్పారు. హొర్ముజ్‌లో ప్రస్తుత పరిస్థితికి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ ఏకపక్ష దాడులే కారణమని ఆరోపించారు. ఇప్పటికీ దౌత్యమార్గంలో సమస్య పరిష్కారానికి ఇరాన్‌ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందుకు దురాక్రమణ పూర్తిగా ఆగిపోవడం, పరస్పర నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యమని మౌసవి పేర్కొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow