త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించనుందని చెన్నై కేంద్రంగా పనిచేసే 'అగ్ని న్యూస్ సర్వీస్' అనే సర్వే సంస్థ పేర్కొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 44.9శాతం ఓట్లను సాధిస్తుందని పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో 180 స్థానాలను అధికార కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. విపక్ష అన్నాడీఎంకే కూటమికి మరోసారి ఎదురుదెబ్బ తగలనుందని సర్వే సంస్థ వెల్లడించింది. ఈ కూటమి 38.5శాతం ఓట్లను సాధించి, 54 సీట్లకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది.
అన్నాడీఎంకేకి షాక్!
అన్నాడీఎంకే కూటమికి ఈ ఎన్నికల్లో చెన్నై రీజియన్‌లో ఎదురుదెబ్బ తగలనున్నట్లు 'అగ్ని న్యూస్ సర్వీస్' అనే సర్వే సంస్థ అంచనా వేసింది. ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా అన్నాడీఎంకే కూటమి గెలవదని పేర్కొంది. మధ్య తమిళనాడు ప్రాంతంలో పళనస్వామి నేతృత్వంలో కూటమి కేవలం 2 సీట్లు మాత్రమే దక్కించుకుంటుందని వెల్లడించింది. దీంతో అన్నాడీఎంకే కూటమి మరోసారి భారీ ఓటమిని చవిచూసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
టీవీకే ప్రభావం అంతంతమాత్రమే!
సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ ఈ ఎన్నికల్లో అంతంతమాత్రమే ప్రభావితం చూపిస్తుందని సర్వే సంస్థ 'అగ్ని న్యూస్ సర్వీస్' అంచనా వేసింది. 9.7శాతం ఓట్లను టీవీకే సాధిస్తుందని వెల్లడించింది. అలాగే, సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కచ్చి పార్టీ 4.8శాతం ఓట్ల వాటాను పొందే ఛాన్స్ ఉందని, ఇతర పార్టీలు కలిపి 2.1శాతం ఓట్లను దక్కించుకుంటాయని సర్వే సంస్థ పేర్కొంది. రాబోయే ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్, నామ్ తమిళర్ కచ్చి పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ఇద్దరూ ఓటమిని చవిచూసే అవకాశం ఉందని అంచనా వేసింది.