• Other News
  • Live TV
  • రైతు రుణమాఫీ ప్రతిపాదన- కేంద్రం పరిశీలనలో లేదు: నిర్మలా సీతారామన్

    Reporter
    Journalist Chinna Telangana  |  March 23, 2026, 4:59 pm
    రైతు రుణమాఫీ ప్రతిపాదన- కేంద్రం పరిశీలనలో లేదు: నిర్మలా సీతారామన్

    రైతులకు పూర్తి రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. అయితే, రైతుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) ద్వారా సకాలంలో తగినంత రుణం అందించడం కూడా ఉందన్నారు. ఈ కేసీసీ కింద రూ.3 లక్షల వరకు పంట రుణాన్ని రాయితీ వడ్డీ రేట్లకు అందిస్తున్నామని తెలిపారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కింద సకాలంలో తిరిగి చెల్లిస్తే అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామని గుర్తు చేశారు.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన ప్రాధాన్య రంగ రుణాల మార్గదర్శకాల ప్రకారం అనుబంధ కార్యకలాపాల రుణాలతో సహా, పూచీకత్తు లేని స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను రూ.1.60 లక్షల నుంచి రూ. 2.00 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. అలాగే వ్యవసాయంతో సహా ఆర్థిక వ్యవస్థలోని ప్రాధాన్య రంగాలకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తగినంత రుణ ప్రవాహం ఉండేలా చూస్తున్నామని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. వీటితోపాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద రైతులకు నేరుగా నగదు బదిలీతో పాటు పంటల బీమా అందిస్తున్నామని పేర్కొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow