• Other News
  • Live TV
  • క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రించిన ఎస్సీలకు ఆ హోదా దక్కదు : సుప్రీంకోర్టు

    Reporter
    Journalist Chinna Telangana  |  March 24, 2026, 5:10 pm
    క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రించిన ఎస్సీలకు ఆ హోదా దక్కదు : సుప్రీంకోర్టు

    న్యూఢిల్లీ: కులం హోదా అంశంలో ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) కీల‌క తీర్పును వెలువ‌రించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మ‌తాల‌కు చెందిన ద‌ళితులు మాత్ర‌మే షెడ్యూల్ కులాల కింద హోదా పొందేందుకు అర్హుల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఈ మూడు మ‌తాలు కాకుండా మ‌రో మ‌తానికి మారితే ఎస్సీల‌కు ఆ హోదా ఉండ‌ద‌ని కోర్టు పేర్కొన్న‌ది. క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రించిన వారికి షెడ్యూల్ కులాల హోదా ద‌క్క‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అంటే ఓ ద‌ళిత వ్య‌క్తి ఎవ‌రైనా క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రిస్తే, అప్పుడు అది ఎస్సీ-ఎస్టీ చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని సుప్రీం పేర్కొన్న‌ది. జ‌స్టిస్ పీకే మిశ్రా, మ‌న్మోహ‌న్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఓ కేసులో ఆ ఆదేశాలు ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మ‌తాల‌కు కాకుండా మ‌రో మ‌తానికి మారితే , వారు ఎస్సీ హోదాను కోల్పోతార‌ని కోర్టు చెప్పింది.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన పాస్ట‌ర్ చిందాడ ఆనంద్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టి ఈ ఆదేశాలు ఇచ్చింది. మే 2025లో ఏపీ హైకోర్టు ఈ కేసులో తీర్పును వెలువ‌రించింది. అక్కాల రామిరెడ్డి అనే వ్య‌క్తి నుంచి కుల వివ‌క్ష‌ణ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌ట్లు ఆనంద్ త‌న పిటీష‌న్‌లో పేర్కొన్నాడు. ఎస్సీ-ఎస్టీ చ‌ట్టం కింద ఆ పాస్ట‌ర్ ఫిర్యాదు న‌మోదు చేశాడు. అత‌ని ఫిర్యాదు ప్ర‌కారం పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. అయితే ఆ కేసును కొట్టివేయాల‌ని కోరుతూ రామిరెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆనంద్ అనే వ్య‌క్తి క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రించ‌డం వ‌ల్ల ఎస్సీ హోదాను కోల్పోయాడ‌ని, అందుకే ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తున్న‌ట్లు జ‌స్టిస్ ఎన్ హ‌రినాథ్ త‌న తీర్పులో పేర్కొన్నారు. క్రైస్త‌వాన్ని ప్ర‌చారం చేస్తున్న ద‌ళిత వ్య‌క్తి.. ఎస్సీ-ఎస్టీ చ‌ట్టం కింద న్యాయం పొంద‌లేడ‌ని కోర్టు చెప్పింది.

    క్రైస్త‌వ మ‌తానికి మార‌డం వ‌ల్ల ఆనంద్ వ‌ద్ద ఉన్న ఎస్సీ స‌ర్టిఫికేట్ ప‌నికిరాదు అని కోర్టు తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పును త‌ప్పుప‌డుతూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు. అయితే హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ ఇవాళ సుప్రీం తీర్పును ఇచ్చింది.

    📰 e-Paper Clip
    Google News Follow