కేరళ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామిక కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా మూడోసారి గెలవాలి అనే పిలుపు తన హ్యాట్రిక్ కోసం, వ్యక్తిగత కీర్తి కోసం కాదని, ప్రజా కేంద్రక పరిపాలన కోసమేనని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళలోని ప్రజా కేంద్రక పరిపాలనను యావత్ దేశం కోసం ఒక ప్రత్యామ్నాయ నమూనాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు తమపై చూపుతున్న అచంచలమైన విశ్వాసాన్ని చూస్తుంటే, మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం విజయన్ తెలిపారు. వరదలు, నిఫా వ్యాప్తి, కొవిడ్ విపత్తు వంటి సంక్షోభ కాలాల్లో తమ ప్రభుత్వం అందించిన సేవల వల్లే ఇంతటి ప్రజా విశ్వాసం ఏర్పడిందన్నారు. అసాధారణ సవాళ్లు ఎదురైనా సంక్షేమం, అభివృద్ధిలో వేగం తగ్గకుండా తమ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన చెప్పారు.
ఈటీవీ భారత్ : మళ్లీ మీ(ఎల్‌డీఎఫ్) ప్రభుత్వమే ఏర్పడుతుందనే విశ్వాసాన్ని ఇస్తున్న అంశమేంటి ?
సీఎం పినరయి విజయన్ : ఎల్‌డీఎఫ్ కూటమిపై ప్రజలు చూపుతున్న అచంచలమైన విశ్వాసమే మా ఆత్మవిశ్వాసానికి ఆధారం. వరదలు, నిఫా, కొవిడ్ వంటి సంక్షోభ సమయాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే రీతిలో కేరళ తనను తాను రక్షించుకుంది. ఇన్ని మహా సంక్షోభాలు ఎదురైనా, మా ప్రభుత్వం సాంఘిక సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అసాధ్యమని కొట్టిపారేసిన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా పూర్తి చేశాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాం. వారికి ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను అందించాం. అందుకే మా ప్రభుత్వంపై ప్రజలకు అంతటి నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకమే మా కూటమి గెలుపునకు మూలస్తంభంగా మారబోతోంది.