ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై ఆయన తీసుకున్న తాజా నిర్ణయాన్ని 'యూటర్న్ ఉస్తాద్' అంటూ ఎద్దేవా చేసింది. జనగణన, డిలిమిటేషన్ పూర్తి కాకుండానే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నించడం అనేది పూర్తిగా యూటర్న్ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అని విమర్శించారు. ప్రభుత్వ విదేశాంగ వైఫల్యాలు, ఎల్పీజీ, ఇంధన సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇది ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల స్థానాలను 50 శాతం పెంచే యోచనపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
'2023లో పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటాయింపుల్లో కూడా మహిళలకు మూడొంతులు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఈ రిజర్వేషన్లు డెలిమిటేషన్, జనగణన పూర్తి అయిన తర్వాత మాత్రమే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ చట్టంపై చర్చ జరిగినప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ, డెలిమిటేషన్, జనగణన పూర్తయ్యాకే ఇది సాధ్యమని మోదీ ప్రభుత్వం అప్పట్లో స్పష్టం చేసింది. కానీ 30 నెలల తర్వాత ప్రధాని తన అభిప్రాయన్ని మార్చుకుని డెలిమిటేషన్, జనగణన పూర్తికాకుండానే రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తున్నారు' అని జైరాం రమేశ్ విమర్శించారు.