• Other News
  • Live TV
  • దౌత్యంలో మోదీ ప్రభుత్వం ఘోర వైఫల్యం : పశ్చిమాసియా యుద్ధంలో పాక్ మధ్యవర్తిత్వంపై కాంగ్రెస్ ఫైర్

    Reporter
    Journalist Chinna Telangana  |  March 26, 2026, 4:59 pm
    దౌత్యంలో మోదీ ప్రభుత్వం ఘోర వైఫల్యం : పశ్చిమాసియా యుద్ధంలో పాక్ మధ్యవర్తిత్వంపై కాంగ్రెస్ ఫైర్

    పశ్చిమాసియా యుద్ధంలో మధ్యవర్తిగా పాకిస్థాన్ వ్యవహరిస్తోందనే అంశం ప్రాంతీయ దౌత్యంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ఈవిషయంలో భారత్ తత్తరపాటును కనిపించకుండా కవర్ చేసే ప్రయత్నాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. సీమాంతర ఉగ్రవాదం, అణ్వస్త్ర విస్తరణ, సామాన్య ప్రజలపై దాడులు చేసిన దుష్ట చరిత్ర కలిగిన పాక్ లాంటి దేశాన్ని మధ్యవర్తిత్వ పాత్రకు పరిశీలించడం అత్యంత దారుణమని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.

    పాక్ లాంటి దేశానికి మధ్యవర్తిత్వ అవకాశమా ?
    ‘‘పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే చర్చలకు మధ్యవర్తిగా పాకిస్థాన్‌ను పరిగణించడం నిజంగా దారుణం. అది నాలుగు దశాబ్దాలకుపైగా భారతదేశంలో, ఇతర దేశాలలో ఉగ్రవాదాన్ని నడిపించిన దేశం. ఒసామా బిన్ లాడెన్‌ లాంటి భయంకరమైన ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం ఇచ్చింది. ఇతర దేశాలకు అణ్వస్త్ర టెక్నాలజీని అందించడానికి పాక్‌లోని ఏక్యూ ఖాన్ నెట్‌వర్క్ ప్రయత్నాలు చేసింది. దీని గురించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ ఈవిషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. ఈవిధంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టాలను పాక్ ఘోరంగా ఉల్లంఘించింది. అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రులు, పౌర సౌకర్యాలపై పాక్ బాంబు దాడులు చేసింది. బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో సొంత పౌరులపైనే పాక్ ఎటాక్స్ చేసింది. వివిధ ప్రావిన్సులలో మతపరమైన మైనారిటీలపై దాడులు చేసింది. అలాంటి పాక్‌కు దౌత్యపరమైన వ్యవహారాల్లో స్థానం ఉండకూడదు’’ అని ట్వీట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ రాసుకొచ్చారు.


    మోదీ దౌత్యంలో ఆర్భాటమే తప్ప, ప్రభావం లేదు
    ‘‘పశ్చిమాసియా యుద్ధంలో మధ్యవర్తిత్వ పాత్ర కోసం పాక్‌ను పరిగణనలోకి తీసుకోవడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మోదీ కౌగిలింతల దౌత్యం(హగ్లోమసీ) ఆర్భాటంగా ఉందే తప్ప, ప్రభావవంతంగా లేదు. భారత ప్రధాని సాహసోపేతంగా స్వేచ్ఛాయుత నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారనే ఆరోపణ ఉంది. తనను తాను విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని మోదీ వైఫల్యం వల్లే చీలిపోయిన పాక్ లాంటి దేశానికి బ్రోకర్‌గా మారే అవకాశం దక్కింది. 26/11 అనంతర కాలంలో మన్మోహన్ సింగ్ హయాంలో పాక్ అంతర్జాతీయంగా ఏకాకిగా ఉండేది. అయితే 2025 ఏప్రిల్‌ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి ముందు పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేసినా, పాక్‌ను భారతదేశం ఏకాకి చేయలేకపోయింది. దీనివల్లే ఆనాడు ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ ముగిసిన (2025 మే 10) తర్వాతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇష్టమైన వ్యక్తిగా ఆసిమ్ మునీర్ మారారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow