వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించే ఆహారం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదును రైల్వే బోర్డు తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ)పై రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో పాటు, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై రూ.50 లక్షల ఫైన్ వేసింది. అంతేకాకుండా అతడి కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ప్రతినిధి స్పందించారు. ప్రయాణికుల భద్రత, నాణ్యమైన సేవలు తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ఇలాంటి లోపాలను సహించేది లేదని పేర్కొన్నారు.మార్చి 15వ తేదీన పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 21896)లో ప్రయాణించిన ఒక ప్రయాణికుడు ఆహార నాణ్యత సరిగా లేదని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రైల్వే శాఖ, ఆహారంలో నాణ్యత లోపాలు ఉన్నట్లు నిర్ధారించింది. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్‌పై వేటు వేయగా, ఐఆర్‌సీటీసీపై ఫైన్ విధించింది.
ఫిర్యాదులు కొంతమేర తగ్గాయి
మరోవైపు, రైళ్లలో సరఫరా చేసే ఆహార నాణ్యతను భారతీయ రైల్వే సమర్థించుకుంది. భారత రైల్వే ప్రతి ఏటా సుమారు 58 కోట్ల భోజనాలను అందిస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, అధిక ఛార్జీలకు సంబంధించిన ఫిర్యాదులతో సహా సాధారణ ఫిర్యాదులు సగటున కేవలం 0.0008% మాత్రమే నమోదు అయ్యాయని తెలిపింది. అధిక ధరలు వసూలు చేయడం నుంచి ఆహార నాణ్యత వరకు అన్ని ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని తెలిపింది. అయితే, గత మూడేళ్లలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి మొత్తం రూ.2.6 కోట్ల మేర జరిమానాలు విధించినట్లు భారత రైల్వే శాఖ వెల్లడించింది. 2025లో ప్యాంట్రీ కార్ సిబ్బంది ప్రయాణికులపై దాడులకు సంబంధించిన మూడు ఘటనలు నమోదయ్యాయని తెలిపింది. ఈ కేసుల్లో సంబంధిత సిబ్బందిపై రైల్వే పోలీస్ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.