• Other News
  • Live TV
  • బీజేపీ ఎత్తు - మమత పైఎత్తు: సువేందుపై నందిగ్రామ్‌లో అనూహ్య అభ్యర్థి- 2021 రివేంజ్ తీరేనా?

    Reporter
    Journalist Chinna Telangana  |  March 28, 2026, 4:38 pm
    బీజేపీ ఎత్తు - మమత పైఎత్తు: సువేందుపై నందిగ్రామ్‌లో అనూహ్య అభ్యర్థి- 2021 రివేంజ్ తీరేనా?

    బీజేపీ ఎత్తు వేస్తే, బంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పైఎత్తు వేశారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో తనను ఓడించిన బీజేపీ నేత సువేందు అధికారికి గట్టి పోటీ ఇచ్చేందుకు పెద్ద స్కెచ్‌ వేశారు దీదీ. ఈ సారి మమతా బెనర్జీ సిట్టింగ్ అసెంబ్లీ స్థానం భవానీపుర్‌‌తో పాటు నందిగ్రామ్‌లోనూ సువేందు పోటీ చేస్తున్నారు. భవానీపుర్‌‌‌లో నేరుగా మమతే, సువేందును ఢీకొంటారు. ఇక నందిగ్రామ్‌లో సువేందు‌ను ఓడించేందుకు ఓ కీలక వ్యక్తిని మమతా బెనర్జీ బరిలోకి దింపారు. ఆయన పేరే పవిత్ర కర్. ఇంతకీ ఎవరీయన ? పవిత్ర కర్ ఎంట్రీతో నందిగ్రామ్‌ ఎన్నికల ఫలితం మారిపోతుందా ? రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న సువేందుపై ఒత్తిడి పెరుగుతుందా ? ఈ కథనంలో చూద్దాం.

    మమత vs సువేందు : ఫ్లాష్ బ్యాక్
    2011, 2016 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపుర్ స్థానం నుంచి మమతా బెనర్జీ ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2021 ఎన్నికల్లో భవానీపుర్ స్థానాన్ని వదిలేసి, నందిగ్రామ్ స్థానంలో దీదీ పోటీ చేశారు. కేవలం బీజేపీ నేత సువేందు అధికారిని ఓడించేందుకే ఆనాడు ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అతి విశ్వాసం, తొందరపాటుతో తీసుకున్న ఈ నిర్ణయం ఫెయిలైంది. నందిగ్రామ్‌లో 1,956 ఓట్ల స్వల్ప మెజారిటీతో బీజేపీ నేత సువేందు అధికారి గెలిచారు. వాస్తవానికి పూర్వ మేదినీపుర్ జిల్లాలోని నందిగ్రామ్ స్థానం టీఎంసీ పార్టీకి ఆయువు పట్టు లాంటిది. సువేందు అధికారి 21 సంవత్సరాలు టీఎంసీలోనే ఉన్నారు. 2007లో నందిగ్రామ్‌లో జరిగిన ప్రజా ఉద్యమంలో మమతా బెనర్జీతో పాటు స్థానిక టీఎంసీ నేతగా సువేందు అధికారి బాగా ప్రజాదరణ పొందారు. ఈ ఇద్దరికీ ఇక్కడ మంచి పాపులారిటీ, ఫాలోయింగ్ ఉన్నాయి.

    అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో సువేందు అధికారి 2020 డిసెంబరు 19న టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ సీటును సువేందుకు బీజేపీ ఇచ్చింది. దీంతో సువేందుపై స్వయంగా దీదీ పోటీచేశారు. స్థానికుడు కావడంతో సహజంగానే సువేందుకు కలిసొచ్చింది. దీని ఫలితంగానే స్వల్ప మెజారిటీతో మమతను ఆయన ఓడించగలిగారు. అయితే అప్పట్లో ఒకే ఒక స్థానంలో పోటీ చేయడం ద్వారా దీదీ తప్పుచేశారు. ఈసారి సువేందు అధికారి అందుకు భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఓ వైపు భవానీపుర్‌లో మమతపై, మరోవైపు తన సిట్టింగ్ స్థానం నందిగ్రామ్‌లో ఆయన పోటీ చేస్తున్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow