దేశంలో వీఐపీ విమాన ప్రయాణాల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ప్రయాణించే విమానాల కోసం కఠిన నిబంధనలు అమలు చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి 27వ తేదీతో విడుదలైన ఆ ఆదేశాలు గతంలో అమల్లో ఉన్న పలు సర్క్యులర్లను పూర్తిగా భర్తీ చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో జరిగే విమాన ప్రయాణాల్లో తరచూ భద్రతా లోపాలు బయటపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. ముఖ్యంగా తాత్కాలిక హెలిప్యాడ్లు, చిన్న ఎయిర్‌స్ట్రిప్‌ల వద్ద జరిగే ఘటనలు ప్రమాదకరంగా మారుతున్నాయని గుర్తించింది. ఇటీవల అమల్లోకి వచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టంలోని సెక్షన్ 4 కింద కొత్త న్యాయపరమైన విధానాలను కూడా ప్రకటించారు. ఈ చట్టం ద్వారా విమాన భద్రతపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణ సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఎవరికి వర్తిస్తాయి ఈ నిబంధనలు?
డీజీసీఏ స్పష్టంగా డిగ్నిటరీలు అనే వర్గాన్ని నిర్వచించింది. ఈ జాబితాలో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, కేంద్ర కేబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, అలాగే ఎస్‌పీజీ భద్రత కలిగిన వ్యక్తులు (జెడ్ ప్లస్ కేటగిరీ) ఉన్నారు. ఈ విధంగా స్పష్టమైన నిర్వచనం ఇవ్వడం ద్వారా అన్ని వీఐపీ ప్రయాణాలకు ఒకే విధమైన భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనే ఉద్దేశ్యం ఉందని డీజీసీఏ తెలిపింది.