అసోంలో ఒకప్పుడు దీర్ఘకాలం అస్థిరత, అశాంతి నెలకొన్నప్పటికీ, గత దశాబ్దంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందని తెలిపారు. ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న అసోంలో 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్ సంవాద్' కార్యక్రమంలో భాగంగా బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'రాష్ట్ర అభివృద్ధికి శాంతి పునాది'
గతంలో హింసతో అల్లకల్లోలమైన అసోం ఇప్పుడు నూతన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని మోదీ అన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం శాంతి స్థాపన కోసం కృషి చేయడంతో పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో వివిధ సంస్థలతో 12 శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. ఒక రాష్ట్ర అభివృద్ధికి శాంతి అత్యవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గత పదేళ్లలో నిజాయితీగా అమలు చేసిన శాంతి ఒప్పందాల వల్ల అసోంలో స్థిరత్వం నెలకొన్నట్లు చెప్పారు. యువత భవిష్యత్తు భద్రత కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం వార్తల్లో నిలిచేందుకు ఒప్పందాలు చేసేవని మోదీ విమర్శించారు. ఆ ఒప్పందాలు కాగితాలకే పరిమితమయ్యాయని, యువతను నిరాశలోకి నెట్టాయని అన్నారు. బోడో సమస్య సహా అనేక అంశాల్లో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో తిరుగుబాటుదారులు, విద్యార్థి సంఘాలతో చేసుకున్న ఏ ఒప్పందమూ ఫలించలేదని విమర్శించారు.
మొదటిసారి ఓటర్లకు పిలుపు
మొదటిసారి ఓటు వేయనున్న యువతకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల దుష్పరిపాలన గురించి గుర్తు చేయాలని పార్టీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించారు. చిన్న తప్పిదం కూడా రాష్ట్రాన్ని మళ్లీ వెనక్కి నెడుతుందని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఏఐ రూపొందించిన వీడియోలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అలాగే అసోంలో ఈసారి కూడా హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మోదీ తెలిపారు.