కేరళ : ఎక్కడికి వెళ్లినా ఆలయాలు, మతం గురించే మాట్లాడే ప్రధాని మోదీ, పాలక్కడ్ ఎన్నికల ప్రసంగంలో శబరిమల అంశంపై మౌనం వహించడం సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, వామపక్ష ఎల్‌డీఎఫ్ కూటమి కలిసి పనిచేస్తున్నందు వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. మతం కంటే రాజకీయాలకు ప్రాధాన్యతను ఇచ్చినందు వల్లే, శబరిమల అంశాన్ని ప్రసంగంలో మోదీ ప్రస్తావించలేదన్నారు.
శబరిమలలో ఏం జరిగిందో మర్చిపోయినట్లుగా మోదీ వ్యవహరించారని రాహుల్ విమర్శించారు. అధికార వామపక్ష కూటమి నేతలు అయ్యప్ప ఆలయం బంగారాన్ని స్వాహా చేసి దాని స్థానంలో ఇత్తడిని పెట్టారనే విషయాన్ని ప్రధాని మర్చిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అయ్యప్ప ఆలయానికి నెలవైన పాలక్కడ్ జిల్లాకు వచ్చినప్పుడు శబరిమల గురించి మాట్లాడకపోవడం సరికాదన్నారు. యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే అయ్యప్ప ఆలయంలో జరిగిన అక్రమాలతో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోమవారం కేరళలోని పథనంతిట్ట జిల్లా అడూర్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎల్‌డీఎఫ్ కూటమిలో బీజేపీ రహస్య హస్తం
"ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - సీపీఎంలతో కూడిన ద్వయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఈదఫా బీజేపీ పూర్తి మద్దతును కలిగిన వామపక్ష ఎల్‌డీఎఫ్ కూటమితో మేం పోరాడుతున్నాం. ఒక వైపు కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఉంది. మరోవైపు సీపీఎం - బీజేపీల ద్వయం ఉంది. ఎల్‌డీఎఫ్ కూటమిలో బీజేపీ రహస్య హస్తం దాగి ఉంది. సాధారణంగా రహస్య హస్తం లాంటి కాన్సెప్ట్‌లను మార్కెట్లతో ముడిపడిన ఆర్థికవేత్తలు వినియోగిస్తుంటారు. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని బీజేపీ కోరుకుంటోంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీకి సవాల్ విసురుతున్న ఏకైక రాజకీయ శక్తి కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లతో మేం సైద్ధాంతికంగా పోరాడుతున్నాం. ఎల్‌డీఎఫ్ లాంటి కూటమి కేరళలో అధికారంలో ఉన్నా, తమ నియంత్రణలోనే పని చేస్తుందని బీజేపీ భావిస్తోంది. బీజేపీ నియంత్రణలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఉన్నందు వల్లే సీఎం పినరయి విజయన్‌పై ఒక్క కేసూ నమోదు కాలేదు. బీజేపీపై సీఎం పినరయి విజయన్ పల్లెత్తు మాట కూడా అనలేదు. బీజేపీ- ఎల్‌డీఎఫ్ కుమ్మక్కుకు ఇవే నిదర్శనాలు" అని రాహుల్ గాంధీ తెలిపారు.