భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశ భవిష్యత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తాకట్టు పెట్టారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఒప్పందం వల్ల దేశ రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆక్షేపించారు. కేరళలోని కన్నూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, బీజేపీకి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కి మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆ రెండింటితో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF పోరాడుతోందని వెల్లడించారు. సీపీఐ (ఎం) ఏమాత్రం వామపక్ష పార్టీ కాదని, అతివాద రైట్‌వింగ్ పార్టీ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు బీజేపీతో జత కట్టారని విమర్శించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో LDF గెలవాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.
నరేంద్ర మోదీని డొనాల్డ్ ట్రంప్ ఎలాగైతే నియంత్రిస్తున్నారో అలాగే కేరళ ముఖ్యమంత్రిని ప్రధాని నియంత్రిస్తున్నారు. తన కేసు విషయంలో నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవడం లేదని కేరళ సీఎంకు తెలుసు. తనను జైలులో ఉంచేందుకు కావాల్సిన తాళం చెవి మోదీ దగ్గర ఉందని కూడా కేరళ సీఎంకు తెలుసు. నరేంద్ర మోదీని కాంగ్రెస్, రాహుల్ గాంధీ విమర్శించడం మీరు చూస్తారు. కానీ, మోదీని కేరళ సీఎం విమర్శించడం మీరు అసలే చూడలేరు. అలానే కేరళ సీఎంను మోదీ విమర్శించడం కూడా చూడరు.
--రాహుల్ గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత
శబరిమల గోల్డ్ స్కాంపై మోదీ మాట్లాడరేం?: రాహుల్ గాంధీ
ఇతర చోట్ల మతం, దేవుడి గురించి మాట్లాడే మోదీ కేరళలో మాత్రం ఆ విషయాలను ప్రస్తావించరని రాహుల్ గాంధీ ఆరోపించారు. శబరిమల ఆలయంలో జరిగిన బంగారు తాపడాల కుంభకోణం గురించి ఇప్పటివరకు ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బంగారు తాపడాలు మాయమవడం వెనక సీపీఐ నేతల హస్తం ఉన్నందువల్లే ఈ విషయంలో బీజేపీ మౌనంగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీతో సీపీఐ జత కట్టడం ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు నచ్చలేదని, అందువల్లే వారు యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు.