రంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, హీరో విజయ్ బరిలోకి దిగారు. చివరిసారిగా 1991లో మాజీ సీఎం జయలలిత(అన్నా డీఎంకే) బర్గూర్, కంగేయం స్థానాల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కంగేయం స్థానానికి రాజీనామా చేసి, బర్గూర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత మరో అగ్రనేత ఎవరూ రెండు స్థానాల్లో పోటీ చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు దళపతి విజయ్ రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. అయితే, ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారు? జయలలిత లాగే డబుల్ ధమాకాను సొంతం చేసుకుంటారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
1950వ దశకంలోనే మొదలైన ట్రెండ్
రెండు అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానాల నుంచి రాజకీయ అగ్రనేతలు పోటీ చేసే సంప్రదాయం 1950వ దశకం చివర్లోనే మొదలైంది. 1957 లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి తన సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్, మధుర స్థానాల నుంచి పోటీ చేశారు. ఆయన మధుర స్థానంలో ఓడిపోగా, బలరాంపూర్‌లో గెలిచారు. తదనంతర కాలంలో ఈ విధంగా రెండు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసిన ప్రముఖ నేతల్లో ములాయం సింగ్ యాదవ్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఉన్నారు.
తమిళనాడులో జయలలితతోనే నాంది
తమిళనాడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల చరిత్రను ఓసారి పరిశీలిస్తే, 2 స్థానాల్లో పోటీచేసిన తొలి నాయకురాలిగా జయలలిత నిలిచారు. అన్నా డీఎంకే పార్టీ అధినేత్రి హోదాలో 1991లో బర్గూర్, కంగేయం స్థానాల్లో ఆమె పోటీచేశారు. రెండుచోట్లా గెలిచి తన రాజకీయ సత్తాను చాటుకున్నారు. కంగేయం స్థానానికి రాజీనామా చేసి, బర్గూర్ ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యారు. అయితే ఆ తర్వాత ఎప్పుడూ రెండు స్థానాల్లో జయలలిత పోటీ చేయలేదు. కానీ అనూహ్యంగా 1996 అసెంబ్లీ ఎన్నికల్లో బర్గూర్ స్థానంలో జయలలిత ఓటమిని ఎదుర్కొన్నారు. జయలలితపై డీఎంకే అభ్యర్ధి సుగవనం గెలిచారు.