కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు అయినప్పటికీ, లోకల్ లీడర్‌కు ఉన్నంత అవగాహన కూడాలేదని విమర్శలు గుప్పించారు. గత అనుభవాల నుంచి నేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. అంతేకాదు, రాహుల్ ఆయన పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోతమంగళంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"వాస్తవం ఏమిటంటే, రాహుల్ గాంధీ ఓ జాతీయ నాయకుడు. అయినప్పటికీ ప్రాంతీయ నాయకుడికి ఉన్నంత అవగాహన కూడా ఆయనకు లేదు. అంతేకాదు, ఆయన ఏ విషయాన్ని ఆయన లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి లక్షణాలు రాజకీయ నాయకుడికి తగవు. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిలో ఇలాంటి దిగజారుడు కనిపించడం ఆశ్చర్యకరం"